న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా 2,50,000 మంది ప్రాణాలు విడువగా రెండు చిన్న దేశాలు మాత్రం ప్రాణాంతక వైరస్ బారినపడిన వారిలో మరణాల రేటును సమర్ధవంతంగా నిరోధించగలిగాయి. ఖతార్, సింగపూర్‌లలో కరోనా పాజిటివ్ కేసుల్లో మరణాల రేటు కేవలం 0.1 శాతంగా నమోదవడం గమనార్హం. ఆసియాలో అత్యధిక కేసులు నమోదైన దేశాలైన సింగపూర్‌లో ఈ వారాంతంలో 102 సంవత్సరాల మహిళ ప్రాణాంతక వైరస్‌తో పోరులో విజయం సాధించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆయా దేశాల్లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మహమ్మారిని దీటుగా ఎదుర్కోవడం ఇందుకు కారణమని వైద్యారోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఖతార్‌లో వైరస్ మరణాల రేటు 0.07గా నమోదవడం వైద్య నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. 16,000కు పైగా పాజిటివ్ కేసులు నమోదైన ఖతార్‌లో కేవలం 12 మరణాలే చోటుచేసుకున్నాయి. సింగపూర్‌లో 19,000 కేసులు నమోదు కాగా మరణాల రేటు 0.09 శాతానికే పరిమితమైంది.
మరణాల రేటును నియంత్రించిన చిన్న దేశాలు